మహ్మదీయ దండయాత్రలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

Telugu lo fast, simple, and reliable updates on education, technology, jobs, current affairs, lifestyle and daily useful information. Trusted news & knowledge platform.

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

మహ్మదీయ దండయాత్రలు

        మధ్యయుగ భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానులు, మొఘలులు లాంటి మహ్మదీయులు పరిపాలించడం వల్ల ఆ కాలాన్ని చరిత్రకారులు మహ్మదీయ యుగంగా అభివర్ణించారు.
        భారతదేశంపైకి తొలిసారిగా దండెత్తి వచ్చిన మహ్మదీయులు అరబ్బులు. అనంతరం తురుష్క పాలకులైన గజనీ, ఘోరీ మహ్మద్‌లు భారతదేశంపై దండెత్తారు. ఘోరీ మహ్మద్‌ భారత్‌లో ఇస్లాం రాజ్యస్థాపనకు పునాదివేయగా, అతడి ప్రతినిధి కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఇస్లాం రాజ్య విస్తరణ చేశాడు.

అరబ్బుల సింధు దండయాత్ర (క్రీ.శ. 712)

        భారతదేశంపైకి దండెత్తి వచ్చిన తొలి ముస్లిమ్‌లు/ మహ్మదీయులు అరబ్బులు. క్రీ.శ.712లో మహ్మద్‌బీన్‌ ఖాసిం నాయకత్వంలోని అరబ్బులు సింధు ప్రాంతంపై దాడిచేసి సింధు పాలకుడు దాహిర్‌ను అలోర్‌ యుద్ధంలో ఓడించి ఆక్రమించాడు. అరబ్బులు ప్రాచీన కాలం నుంచి భారతదేశంతో వర్తక, సాంస్కృతిక సంబంధాలను కలిగిఉన్నారు. అయితే క్రీ.శ.632లో తన 62వ ఏట మహ్మద్‌ ప్రవక్త మరణానంతరం వీరు ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలన్న సంకల్పంతో ప్రపంచ రాజ్యాలపై దాడులను విస్తృతం చేశారు. ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, పూజారుల ప్రమేయంలేని నిరాడంబర ఆరాధన విధానం, సాంఘిక సమానత్వం మొదలైనవి మహ్మద్‌ బోధించిన ఇస్లాం మత ముఖ్య సూత్రాలు. ఇస్లాం అవతరణ, వ్యాప్తి అరబ్బుల దృక్పథంలో మార్పును తెచ్చింది.  
        అరబ్బులు మతం పేరున ఏకం అయ్యారు. వారు సిరియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్‌ మొదలైన రాజ్యాలను ఆక్రమించి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేశారు. ఇదే క్రమంలో సింధు, అఫ్గానిస్థాన్‌లను ఆక్రమించాలని వ్యూహాన్ని రూపొందించారు.  వీరు ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పు దిశకు వ్యాప్తి చేయాలన్న వారి లక్ష్యం కాబూల్‌ ఆక్రమణకు కారణమైంది.
        కాబూల్‌ ఆక్రమణ వారిని భారతదేశ సరిహద్దులకు సన్నిహితం చేసింది. ఈ సమయంలోనే అరబ్బులు సింధు దండయాత్రకు కారణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నాటి ఖలీఫా వాజిద్‌కు హెజ్జాజ్‌ అనే పాలకుడు పంపించిన కానుకల నౌక సింధు ప్రాంతపు ఓడరేవు అయిన దేబాల్‌లో దోపిడీకి గురయ్యింది.
ఈ విషయంపై ఆగ్రహించిన ఖలీఫా సింధు పాలకుడు దాహిర్‌కు జరిగిన దోపిడీ విషయంపై సంజాయిషీ కోరాడు. దానికి సింధు పాలకుడు సంతృప్తికరమైన జవాబు ఇవ్వకపోవడంతో ఖలీఫా తన ప్రతినిధి అయిన హెజ్జాజ్న్‌ు సింధు పాలకుడిపై చర్యలు తీసుకోమని ఆజ్ఞాపించాడు. ఫలితంగా హెజ్జాజ్‌ తన అల్లుడైన మహ్మద్‌బీన్‌ ఖాసిం నాయకత్వంలో అరబ్బులను సింధు ప్రాంత దండయాత్రకు పంపాడు. క్రీ.శ.712లో జూన్‌ 20న జరిగిన అలోర్‌ (రేవార్‌) యుద్ధంలో ఖాసిం సేనలు దాహిర్‌ను ఓడించాయి.
        దాహిర్‌ భార్య రాణిబాయి జౌహార్‌ చేసుకుంది. దాహిర్‌ సేనాని మోకా మహ్మద్‌బీన్‌ ఖాసిం పక్షం వహించడంతో దాహిర్‌ ఓటమి సులభమైంది. ఖాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. అనంతరం ఖాసిం ముల్తాన్‌ ప్రాంతంపై దాడి చేసి దాన్ని కూడా వశపరచుకున్నాడు. కనోజ్‌పై కూడా దాడి చేయడానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఖలీఫా ఆదేశాల మేరకు తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు.
        అరబ్బుల సింధు దండయాత్ర విజయవంతం కావడానికి ప్రధాన కారణం నాటి భారతదేశంలో రాజపుత్రుల మధ్య ఐక్యత లోపించడం. ఈ దండయాత్ర భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితుల్లో అనేక మార్పులకు కారణమైంది.
        ముఖ్యంగా అరబ్బులు భారతదేశ సంస్కృతిని ఇతర దేశాల్లో ప్రచారం చేసి భారతీయ సాంస్కృతిక రాయబారులుగా పేరొందారు. నాటి నుంచే భారతదేశ విదేశీ వాణిజ్యం అరబ్బుల చేతిలోకి వెళ్లింది. భారతదేశంలోకి తొలిసారిగా ఇస్లాం మతం ప్రవేశించింది. తొలిసారిగా జిజియా పన్ను వసూలు చేయడం జరిగింది.
* ‘‘అరబ్బుల సింధు దండయాత్ర సత్ఫలితాలు ఇవ్వని ఘనవిజయం’’  - ప్రముఖ చరిత్రకారుడు లేన్‌పూలే

 

తురుష్క దండయాత్రలు

        అరబ్బుల తర్వాత భారతదేశంపై దండెత్తి వచ్చిన మహ్మదీయ పాలకులు తురుష్కులు. వారిలో మొదట గజనీ మహ్మద్, అనంతరం ఘోరీ మహ్మద్‌ భారతదేశంపై దండెత్తి వచ్చారు. వీరి దండయాత్రల వల్ల భారతదేశ సిరిసంపదలు దోపిడీకి గురయ్యాయి. భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపన జరిగింది.

గజనీ మహ్మద్‌

        క్రీ.శ.1000-1027 మధ్య భారతదేశంపై 17 సార్లు దండెత్తిన తురుష్క పాలకుడు గజనీ మహ్మద్‌. ఇతడు గజనీ రాజ్య పాలకుడు సబక్తజిన్‌ కుమారుడు. క్రీ.శ.998లో గజనీ మహ్మద్‌ ఘజనీకి పాలకుడయ్యాడు. ఆయన గొప్ప యోధుడు. తన సేనలను ఉత్తేజపరచడంలో అసమాన తెలివితేటలను ప్రదర్శించేవాడు. సున్నీ శాఖ సూత్రాలను నిష్టగా ఆచరించాడు. మతఛాందసవాది.

లక్ష్యాలు: భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం, విగ్రహారాధన నిర్మూలించడం, సిరిసంపదలను కొల్లగొట్టడం లాంటి లక్ష్యాలతో గజనీ మహ్మద్‌ దండయాత్రలను చేపట్టాడు.

దండయాత్రలు: తన మొదటి దండయాత్రలో నాటి పంజాబ్‌ (భటిండా) పాలకుడైన జయపాలుడ్ని (హిందూషాహీ వంశస్థుడు) ఓడించి తన విజయయాత్రలకు శ్రీకారం చుట్టాడు. తన 5వ దండయాత్రలో ఆనందపాలుడ్ని ఓడించాడు. 12వ దండయాత్రలో కనోజ్‌ పాలకుడైన రాజ్యపాలుడ్ని ఓడించాడు. 14వ దండయాత్రలో గ్వాలియర్‌ పాలకుడ్ని, 15వ దండయాత్రలో కలింజర్‌ పాలకుడ్ని ఓడించి అపార ధనరాశుల్ని కొల్లగొట్టాడు. గజనీ మహ్మద్‌ దండయాత్రల్లో అతి ప్రధానమైంది క్రీ.శ.1025లో గుజరాత్‌పై చేసిన 16వ దండయాత్ర ఇక్కడి కథియావార్‌లోని సుప్రసిద్ధ సోమనాథ్‌ ఆలయంపై దాడి చేసి అక్కడి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆలయధనాన్ని, నగలను, ఆభరణాలను దోచుకున్నాడు. నాడు గుజరాత్‌ను పరిపాలిస్తున్న సోలంకీ వంశ రాజైన మొదటి భీముడ్ని ఓడించాడు. 1027లో చివరి దండయాత్రను జాట్‌లపై జరిపాడు. సోమనాథ్‌ దండయాత్ర నుంచి అపార ధన, కనకరాశులతో తిరిగి వస్తున్న తన సేనలపై జాట్‌లు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి గజనీ మహ్మద్‌ వారిపై దండెత్తాడు. చివరికి నిరంతర యుద్ధాలు, క్షీణించిన ఆరోగ్యంతో రెండేళ్ల తర్వాత గజనీ తన రాజ్యంలో 1029లో మరణించాడు.

ఫలితాలు

        గజనీ మహ్మద్‌ దండయాత్రలు భారతదేశంలో అనేక మార్పులకు కారణమయ్యాయి. మధుర, కథియావార్, కనూజ్‌లలోని అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి.  కొన్ని దేవాలయాలు ఇస్లాం మసీదులుగా మారాయి. ఇస్లాం మతం భారతదేశానికి వ్యాపించింది. రాజపుత్రులు బలహీనపడ్డారు. నాటి ఖలీఫా గజనీ మహ్మద్‌కు ‘యామీన్‌ ఉద్దౌలా’ అనే బిరుదును ప్రదానం చేశాడు. గజనీ మహ్మద్‌తో పాటు భారతదేశానికి వచ్చిన ప్రముఖ పారశీక చరిత్రకారుడు ‘ఆల్‌ బెరూనీ’ భారతదేశ విషయాలను పొందుపరుస్తూ కితాబ్‌-ఉల్‌-హింద్‌/ తారిఖ్‌-ఇ-హింద్‌ అనే ప్రముఖ గ్రంథాన్ని రాశాడు. గజనీ మహ్మద్‌ ఆస్థాన కవి ఫిరదౌసి ‘షానామా’ అనే ప్రముఖ గ్రంథాన్ని రచించాడు. ఉత్బ అనే పండితుడు అతడి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు.

ఘోరీ మహ్మద్‌

        క్రీ.శ.1175-1205 మధ్య భారతదేశంపై దండెత్తి వచ్చిన మరొక తురుష్క పాలకుడు ఘోరీ మహ్మద్‌. ఇతడి అసలు పేరు ముయుజుద్దీన్‌. క్రీ.శ.1173లో ఘోరీ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. గొప్పసేనానిగా, సమర్థుడైన నాయకుడిగా పేరొందిన ఘోరీ మహ్మద్‌ విశాల సామ్రాజ్య స్థాపన లక్ష్యంతో దాడులు కొనసాగించాడు.
లక్ష్యాలు
* భారతదేశంలో విగ్రహారాధనను నిర్మూలించడం.
* భారతదేశ సిరి సంపదలను దోచుకోవడం.
* భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం.
* భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని నెలకొల్పడం.
* భారతదేశంపై శాశ్వత ప్రాతిపదికన ముస్లిం రాజ్య సార్వభౌమాధికారాన్ని నెలకొల్పడం.
దండయాత్రలు

* భారతదేశంలో నెలకొన్న అస్థిరత, స్వదేశీ రాజపుత్ర పాలకుల్లో దూరదృష్టి లేకపోవడం, అనైక్యత లాంటి అంశాలు అతడికి కలిసొచ్చాయి. 1175లో ఘోరీ తన తొలి దండయాత్రలో ముల్తాన్‌ రాజ్యాన్ని ఆక్రమించాడు. అరబ్బులు ‘కనకపు నగరం’గా పేర్కొనే ముల్తాన్‌ ఆక్రమణ అతడికి మరింత శక్తినిచ్చింది. తర్వాత సింధ్‌ దిగువ ప్రాంతాలను ఆక్రమించాడు.
* 1178 నాటి దండయాత్రలో గుజరాత్‌ పాలకుడు భీమ్‌దేవ్‌ (భీమదేపుడ్ని)ను ఓడించి అనిహిల్‌వాడ్‌ ప్రాంతాన్ని ఆక్రమించాడు.
* 1179లో పెషావర్‌ ప్రాంతంపై విజయం సాధించాడు. సింధు ప్రాంతం మొత్తం అతడి వశమైంది.
* లాహోర్‌ పాలకుడు ఖుస్రూమాలిక్‌ ఘోరీని ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ 1186 నాటికి లాహోర్‌ ఘోరి వశమైంది.
* ఘోరీ మహ్మద్‌ దండయాత్రల్లో చెప్పుకోదగినవి తరైన్‌ యుద్ధాలు, చంద్‌వార్‌ యుద్ధం.
* ఘోరీ పంజాబ్‌ ఆక్రమణ అనంతరం తన దృష్టిని ఢిల్లీపై కేంద్రీకరించాడు. నాటికి ఢిల్లీ, అజ్మీర్‌లను చౌహాన్‌ వంశస్థుడైన మూడో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పరిపాలిస్తున్నాడు. పృథ్వీరాజ్‌ అసమాన ధైర్య, సాహసాలు కలిగిన పాలకుడు. వీరి మధ్య 1191, 1192ల్లో రెండు తరైన్‌ యుద్ధాలు జరిగాయి. 1191 నాటి మొదాటి తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ ఘోరీని ఓడించాడు. కానీ 1192 నాటి రెండో తరైన్‌ యుద్ధంలో ఘోరీ పృథ్వీరాజ్‌ను వధించి ఢిల్లీ, అజ్మీర్‌లను ఆక్రమించాడు. భారతదేశంలో తను ఆక్రమించిన ప్రాంతాలపై తన ప్రతినిధిగా కుతుబుద్దీన్‌ ఐబక్‌ను నియమించాడు.
* 1194లో దండెత్తి వచ్చిన ఘోరీ కనూజ్‌ పాలకుడు గహద్వాల వంశరాజు జయచంద్రుడ్ని చంద్‌వార్‌ యుద్ధంలో ఓడించి, అతడి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ దండయాత్ర సమయంలోనే ఘోరీ సేనలు కాశీ సమీపంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేశాయి. భక్తియార్‌ ఖిల్జీ అనే ఘోరీ సేనాని నాయకత్వంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు.
* 1195లో ఘోరీ బయానా, గ్వాలియర్‌ ప్రాంతాలపై దండెత్తాడు. ఘోరీ తన చివరి దండయాత్రను 1205లో చేపట్టాడు. ఘక్కర్‌లనే తెగ ప్రజలను అణచివేయడానికి ఈ దాడి చేశాడు. కానీ తిరుగు ప్రయాణంలో వారి ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 1206లో అతడి ప్రతినిధి కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఘోరీ మహ్మద్‌ను  భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపనకు పునాది వేసిన పాలకుడిగా, కుతుబుద్దీన్‌ ఐబక్‌ను ఇస్లాం సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు.
ఫలితాలు
* మహ్మదీయ దండయాత్రల వల్ల భారతీయ పాలకుల అసమర్థత, అనైక్యత బయటపడింది.
* భారతదేశ సిరిసంపదలు దోపిడీకి గురయ్యాయి. అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి.
* భారతదేశంలో తురుష్కపాలన ప్రారంభమైంది.
* పర్షియన్‌ భాష భారతదేశ రాజభాషగా మారింది. కాలక్రమంలో హిందూ-ముస్లిం వర్గాల మధ్య అవినాభావ సంబంధాలు పెంపొందాయి. ఇండో-ఇస్లామిక్‌ సంస్కృతికి బీజాలు పడ్డాయి.
* ‘‘ఘోరీ దండయాత్రల ఫలితంగా విదేశాలతో భారతదేశ వర్తక, వ్యాపార సంబంధాలు బలపడి పునరుద్ధరించబడ్డాయి’’.  - ప్రసిద్ధ చరిత్రకారుడు జాదూనాథ్‌ సర్కార్‌

 

 

No comments:

Post a Comment

Post Bottom Ad